Sunday, March 8, 2015

నిబద్ధతా? ‘నిర్భయ’మా?



                  స్త్రీ అనే వ్యక్తి లేకుండా ప్రపంచం లేదు అనేది నిర్వివాదమైన అంశం. పురాణాలు,గ్రంధాలు అనేక ఇతర మాధ్యమాల్లో స్త్రీలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్త్రీలను గౌరవించాలి, వారి బలాన్నీ, బలహీనతను విజ్ఞత కలిగిన వ్యక్తిగా అర్ధం చేసుకోవాలి అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. కాని జరుగుతున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉండడం బాధాకరం, ఇది ఎవరూ ఆనందంగా ఆహ్వానించే విషయం కాదు. స్త్రీలపై హింస, అత్యాచారాలు, వేధింపులు, దౌర్జన్యాలు జరగడం నేటి ప్రపంచం చేసుకున్న దౌర్భాగ్యం అయితే ఇప్పటివరకు జరిగిన సంఘటనలు అన్నిటికీ కేవలం పురుషాధిక్య  సమాజంలో వున్న  అనేకమంది స్త్రీ పురుషుల యొక్క ధోరణులు అనుకోవడం ఎంతవరకు సమంజసం.

                     దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో 2012 డిసెంబర్ నెలలో జ్యోతి సింగ్ అనబడే యువతి పై జరిగిన సామూహిక అత్యాచారం నిజంగా మానవజాతి యొక్క అసక్తతకు పరాకాష్ట, ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సమస్యలు ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత దేశంలో అనునిత్యం ఎదో ఒక ప్రాంతంలో ఎదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. వీటి యొక్క మూలాలను అన్వేషించి మళ్ళీ ఇటువంటివి పునరావృత్తం కాకుండా సమస్యను సమూలంగా, సమగ్రంగా నిర్మూలించడానికి ప్రతీ ఒక్క పౌరుని, ముఖ్యంగా యువత యొక్క భాగస్వామ్యం ఎంతో అవసరం.అయితే బాధ్యతగా భావించి భావోద్వేగాలు అతి వేగంగా ఊపందుకునే ప్రస్తుత సమాజం తమ అభిప్రాయాలను  బహిరంగంగా బాహాటంగా ‘నిర్భయం’గా బయటపెట్టి పరనింద, దూషణ, పరస్పర శత్రుత్వాన్ని ఆహ్వానించి తద్వారా న్యాయం చేస్తున్నాం అనుకునే పరిస్థితిలో మనం అంతకు రెట్టించిన అన్యాయం చేస్తోంది.

                  పోయిన జ్యోతి సింగ్ ప్రాణాన్ని భూమి మీద మనం చేసే విమర్శలు, శిక్షలు, శోకాలు, కన్నీళ్ళు తిరిగి తీసుకురాలేవు, ఆమె తల్లిదండ్రులకు ఏర్పడిన లోటు  పూరింపలేనిది, లక్ష గళాలు ఏకమైనా సరే ఇది అసాధ్యం.పోనీ అత్యాచారం అనేదానికి అనుకూలమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా, దీనిని ప్రపంచంలో ఏ సమాజం ఆమోదించదు. మరి ఇటువంటి దురదృష్టకరమైన పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ఇలాంటి పనులకు పూనుకున్న వ్యక్తులను శిక్షించడం మన బాధ్యత కాదా అంటే శిక్ష అనేది సమాజంలోని పరిస్థితిల్లో మార్పును తీసుకువోచ్చే విధంగా ఉండాలి కాని ఏ ఒక్క వ్యక్తినో బాద్యుడిని చేసి, ప్రతీ పౌరుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించి అతడిని ఉరి తీసే విధంగానో, కొట్టి చంపే విధంగానో ఉండకూడదు. సమాజానికి తగిలిన ఇటువంటి గాయాలకు చికిత్స అవసరం. 

                             వాక్స్వాతంత్రం కలిగిన ప్రస్తుత ప్రపంచంలో ఉన్నతమైన విలువలతో కూడుకున్నప్పటికీ అవగాహన రాహిత్యంతో మూడవ వ్యక్తి చేసిన ఒక ప్రయోగం ( బి బి సి చానెల్ వారు తయారు చేసిన ఇండియాస్ డాటర్ అనబడు లఘు దృశ్య శ్రవణ నివేదిక)  తాము ప్రస్తుతం నివసిస్తున్న సమాజంలోని వ్యక్తులను కించపరిచే విధంగా ఉండడం ద్వారా నిజానిజాలను పక్కనపెట్టి త్వరితగతిన ఆవేశం చెందే లక్షణాలు ఉన్న యువత తమకు తామే తప్పుద్రోవలో పట్టే విధంగా ఉంది.ఇది ఒక అంశం అయితే తమ తలరాత ఎలా ఉంటుందో నిర్ణయించే ప్రభుత్వం మారడానికి ఎన్నో సంవత్సారాలు ఒపికపట్టే ప్రజలు ఒక వ్యక్తిని శిక్షించడానికి న్యాయాన్యాయ విచక్షణ కోల్పోయి నడి రోడ్ మీద ఒక వ్యక్తిని లాక్కొచ్చి కొట్టి చంపడం తీవ్రవాదం కాక మరేంటి. దీనిని ఖండించని వ్యక్తులు ప్రపంచంలో కాగడా పెట్టి వేలికిచూసినా కనిపించరు.

                          ఇటువంటి సంఘటన ప్రపంచంలో ఎదో మూలలో కాదు క్షమకు పుట్టిల్లుగా చరిత్ర చేత అభివర్ణింపబడిన, జీవ హింస మహా పాపం అన్న బుద్దుడు నడిచిన ఈ  భారత దేశంలో నాగాలాండ్ రాష్ట్రంలో జరగడం గతంలో ఎవరికంటా పడకుండా జరిగిన అత్యాచారం కన్నా దారుణం, అమానవీయం.దీనికి మనమందరం బాధ్యులమే.ఈ నేపధ్యంలో ఒకవేళ అవకాశం ఉంటే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా కొట్టి చంపే ప్రక్రియలో పాల్గొనడానికి ఎంతమంది ఉత్సాహపడతారు అనేది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న,నా మటుకు నేను దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రతీసమాజానికీ లాభమో లేదా నష్టమో జరగడానికి ఏ ఒక్క వ్యక్తీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని కారణం కాదు ఎందుకంటే వ్యక్తులందరూ కలిస్తేనే సమాజం అవుతుంది. 

                             ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు  లేదా అనుకోని సంఘటన దానికి బాధ కలగడం సహజం అయితే బాధ వేరు భయం వేరు, బాధ అనేది మనల్ని భయపడే విధంగా చేస్తుంది, భయపడిన మనిషి తన అభిప్రాయానికి పక్షపాతి అయ్యే ప్రమాదం ఉంది.భయమనేది కేవలం ఊహ మాత్రమే, ఊహ అనేది ఎప్పటికీ నిజం కాలేదు. ఊహించి తీసుకున్న నిర్ణయానికి ఒక ప్రాణాన్ని వెలకట్టి బలివ్వడం ఎంతవరకు న్యాయం.??? ఇది సమాజాన్ని మార్చాలనే నిబద్ధతా,?? వ్యతిరేకించాలి అనే ‘నిర్భయ’మా?? 

No comments: