మీరందరూ నందినీ రెడ్డి తీసిన అలా మొదలైంది సినిమా చూసారా? ఇప్పుడు మీరు చదవబోయేది ఆ సినిమాకి సంబంధించిన కొనసాగింపు వ్యాఖ్యానం కాదు.సీక్వెల్ అంతకన్నా కాదు. ఏంటి బాగా అతిగా చేసిన ఆలోచన లాగ అనిపిస్తోందా? వదిలెయ్యండి, అలా ఆలోచించకపోతే నాకు నిద్రపట్టదు. సరే విషయానికి వస్తే ఈరోజు అనుకోకుండా నా బ్లాగ్ చూస్తున్న సమయంలో 2007లో ఆంగ్లంలో రాసిన ఒక పోస్ట్ కనిపించింది. నా గురించి తెలిసినవారందరికీ నేను రచనలు, అనువాదాలు చేస్తూ ఉంటాను అన్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే నేను ఒకానొక సమయంలో నా బ్లాగ్లో కేవలం ఇంగ్లీష్ పోస్టులు మాత్రమే చేసేవాడిని. అలా ఎందుకు చేసానో మరి నాకు ఇప్పటివరకూ అర్ధం కాలేదు. బహుశా ఎక్కువమంది చదవడానికి అవకాశం ఉందని ఆ సమయంలో నేను అలోచించి ఉండచ్చు. ఏదేమైనా కేవలం ఒకే ఒక్క పోస్ట్ మాత్రం తెలుగులో ఉంది. కనుక ఆ సంఖ్యను పెంచాలి అని నా కోరిక. అంటే ఎదో బలవంతంగా పెంచాలని కాదు. నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసి కూడా చాలారోజులు, కాదు కాదు చాలా ఏళ్ళు అయ్యింది. నా బ్లాగ్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2015లో రాసాను అంటే దాదాపుగా ఏడు సంవత్సరాలు.
ఈ ఏడు సంవత్సరాలలో చాలానే జరిగాయి.
అందులో కొన్ని నా పెళ్లి జరిగింది, మాకొక పాప పుట్టింది. ఇంకా నేను చేసిన
అనువాదాలు, రచనలు మార్కెట్లో విడుదల అయ్యాయి. ఇంకా చాలానే జరిగాయి, అవన్నీ
రాయాలంటే ఒక పోస్ట్ సరిపోదు. కనుక ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడానికి కారణమైన అసలు విషయానికి
వస్తే ఈ రచనలు చెయ్యాలనే ఆలోచన నాకు ఎక్కడ నుండి పుట్టింది అని నన్ను కొంతమంది
శ్రేయోభిలాషులు అడిగారు. నిజం చెప్పాలంటే నన్ను నేను కూడా చాలా ప్రశ్నించుకున్నాను.
చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర గడిచిపోయిన సంవత్సరం తాలూకు డైరీలో ఉంటే అవి
తీసుకుని అందులో నేను నా దినచర్య రాస్తూ ఉండేవాడిని. దినచర్య అంటే రాయడానికి ఏముంటుంది,
నేనేమైనా నరేంద్ర మోడీనా, మెగాస్టార్ చిరంజీవినా. ఏదో నోటికి వచ్చింది, సారీ
చేతికి వచ్చింది రాసేసేవాడిని. ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్లాను, ఈ బజ్జీల
బండి దగ్గర బజ్జీలు తిన్నాను, అక్కడ మిక్స్చర్ తిన్నాను. ఈ సినిమా చూసాను, రేపు పరీక్ష
ఉంది ఇలాంటివి ఏవేవో పెద్దగా ప్రాముఖ్యత లేని విషయాలు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
అదే డైరీ కొంతకాలం తరువాత చదివితే నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఒకొక్కసారి
అప్పుడు నా మనస్థితి తలుచుకుని నవ్వొచ్చేది. కానీ చాలా ఆనందం వేసేది, నిజం
చెప్పాలంటే అది నాకు మాత్రమే సొంతమైన ఆనందం. దానిని నేను ఎప్పటికీ ఒదులుకోవాలి
అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది, దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఏమీ ఆలోచించకుండా
నేను రాసిన ఒక చిన్న పోస్ట్ ప్రస్తుతం నా జీవితానికి దిశానిర్దేశం చేసే స్థాయికి
చేరుకుంది. అప్పుడు నాకు అర్ధం అయ్యింది ఆ పోస్ట్ యొక్క గొప్పతనం. ఆరోజు నేను
అనుకోకుండా బ్లాగ్ లో రాయకపోతే ఈరోజు నా గమ్యం వైపు నాకు స్పష్టత ఏర్పడి ఉండేది
కాదు. మరి అంత గొప్ప ఆర్టికల్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి కదా. అందుకే ఈరోజు మీతో
ఆ విషయం పంచుకున్నాను.
దీనికి ఇంకొక చిన్న విషయం కూడా జోడించాలి, అదేంటంటే
ఒకొక్కసారి నేను ఇతరుల డైరీలు కూడా దొంగతనంగా చదువుతూ ఉండేవాడిని. అదొక గిల్టీ
ప్లెషర్ లేదా ఏ వీ ఎస్ గారు చెప్పినట్లు ‘అదో తుత్తి,’ అనుకోండి. అప్రస్తుతం
అయినప్పటికీ ఒక విషయం చెప్తాను. నిజానికి చదవడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ చదివిన
వాటిని ఆ డైరీ రాసిన వ్యక్తితో ప్రస్తావించి వాదించడం అనేది మూర్ఖత్వం అవుతుంది.
వారంతట వారుగా చెప్తే కానీ దానిగురించి మాట్లాడకూడదు అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం.
ఒకవేళ మీకు అలా అనిపించలేదు అనుకోండి మీకు అలాంటి అవకాశం దొరికితే ప్రస్తావించి
చూడండి. అప్పుడు నేను చెప్పింది మంచి పద్ధతి అని మీరే ఒప్పుకుంటారు.
ఆ తరువాత కాలంలో కథలు, నవలలు, పుస్తకాలు చదవడం వలన అందులోని
పాత్రలను చాలా దగ్గరగా చూసినట్లు, అవి నాతో మాట్లాడుతున్నట్లు అనుభూతి
చెందేవాడిని. నాకు తెలిసి పుస్తకాలు చదివే అందరికీ ఇలాంటి అనుభూతి ఏదో ఒకసమయంలో
కలిగి ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మొదట నేను ‘ఆక్సిడెంట్,’ అనే ఒక కథ రాసాను.
అందులో పాత్రలు కూడా కల్పితం అయినప్పటికీ ఆ సమయంలో అంటే 2008 లో నా జీవితానికి
దగ్గర పోలికలు ఉంటాయని నాకు అనిపిస్తుంది.
నిజానికి ఏ రచయిత అయినా తన రచన యొక్క పాత్రలు అన్నిటిలో తన
యొక్క ఆత్మను ప్రవేశపెడుతూ ఉంటాడు. అందులో మంచి పాత్రలు, చెడు పాత్రలు అన్నీ కూడా
ఒక ఊహ, లేదా అనుభవం నుంచి ఏర్పడినవే. అలా కథతో మొదలైన నా ప్రయాణం నా ఊహల ప్రపంచంలో
పాత్రల ద్వారా నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. రాస్తున్న కొద్దీ ఆసక్తి,
కుతూహలం ఇంకా ఎక్కువైపోయి ఎవరు చదివినా, చదవకపోయినా పరవాలేదు కనీసం నేను
చదువుకోడానికి అయినా రాయాలి అనే స్థాయికి వెళ్ళిపోయింది.
దీన్నే ఆంగ్లంలో ‘Self Indulgence,” అంటారు. కేవలం ఈ ఒక్క విషయం
వల్ల మాత్రమే ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలలో అద్భుతమైన ఆవిష్కరణలు సాధ్య పడ్డాయి
అని నేను గట్టిగా నమ్ముతాను. దీని గురించి చివరిలో చెప్తాను. ఆ తరువాత కాలంలో మూడు
రచనలు చేసాను, మూడు అనువాదాలు కూడా చేసాను. గోదావరి ప్రచురణలు అనే సంస్థ ద్వారా
అవి మార్కెట్లో విడుదల అయ్యాయి కూడా. అప్పుడే నా గమ్యం లక్ష్యం ఒక్కటే అని నేను
నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయానికి నా ధర్మపత్ని సహకారం కూడా ఉందనుకోండి.
సినిమారంగంలో కష్టాల
లాగ రచయితకి కూడా కష్టాలు ఉంటాయి, అవి సినిమా కష్టాల్లా బయోస్కోప్ లో చూసినట్లు
రంగురంగులగా కనిపించవు. బ్లాక్ అండ్ వైట్లో చాలా స్పష్టంగా మన కళ్ళముందర కనపడతాయి.
ఒకానొక సందర్భంలో రాజకీయం, సినిమా అనేవి జీవిత లక్ష్యాలుగా ఎంచుకుంటే ఎప్పటికీ
జీవితంలో విజయం సాధించలేరు అని ఒక మహానుభావుడు అన్నాడు. మరైతే రచనల గురించి రచయిత
గురించి ఇంకేమనుకోవాలి. అసలు దరిదాపుల్లో కూడా కనిపించమేమో. అలోచించి చూస్తే ఆ వ్యాఖ్య
చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పడంకోసం ప్రత్యేకమైన సందర్భంలో చెప్పి ఉంటారు. కానీ
ప్రస్తుత కాలం చూస్తుంటే అందులో అంత నిజం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం
యొక్క పరిథి విస్తారం అయ్యింది, కనుక అన్ని రంగాలలో ఎదగడానికి ఆస్కారం ఉంది.
ఒక్కోసారి నా పైత్యం ఎలా ఉంటుందంటే, హైపర్ ఆదీ తన మాటలకు
తానే నవ్వుకున్నట్టు నేను రాసింది చూసి నేనే మురిసిపోతాను. అందులో ఎంతమాత్రం తప్పు
లేదు, ఎందుకంటే అలా చెయ్యకపోతే అసలు ఏ రంగంలో ఐనా ముందుకు సాగలేము. మనం చేసినపని
మనకే నచ్చకపోతే, ఇతరులకి ఎలా నచ్చుతుంది. ఇది కేవలం రచనలు మాత్రమే కాదు అన్ని
రంగాలకీ వర్తిస్తుంది. ఇది మా తరం యొక్క స్వరం అని నేను నమ్ముతాను. ఇంకా చాలా విషయాలు
ఉన్నాయి. వీలు చిక్కినప్పుడు వివరిస్తాను, ఖాళీ దొరికినప్పుడు చదవండి.